polavaram: రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి: సీఎం జగన్
- రూ.782 కోట్ల ప్రజాధనం ఆదా చేశాం
- రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం
- వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండర్ల ప్రక్రియపై అధికార వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే, విపక్ష టీడీపీ విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని వైసీపీ నేతలు చెబుతుండగా, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, రూ.782 కోట్ల ప్రజాధనం ఆదా చేశామని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ విధానాలు లేవని చెప్పారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పైనా విప్లవాత్మక విధానాలు చేపట్టామని, అధిక ధరలకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు నిలదొక్కుకోలేవని, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఉందని వివరించారు. పరిశ్రమలకు ఇచ్చే కరెంట్ ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడా లేదని చెప్పిన జగన్, విద్యుత్ రంగంలో పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.