Hyderabad: హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం!
- తడిసి ముద్దయిన జంటనగరాలు
- రోడ్లపై నిలిచిపోయిన నీరు
- స్తంభించిన ట్రాఫిక్..లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వాన కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్ పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ప్రగతినగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, లక్డీకాపూల్, రాణీగంజ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ముగిసే సమయానికి వర్షం మొదలవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కడివారు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. పలు కాలనీల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.