Mehul Choksi: మెహుల్ ఛోక్సీ నిజాయతీలేని వ్యక్తి.. ఆయనను భారత్ కు తిప్పి పంపిస్తాం: ఆంటిగ్వా ప్రధాని
- ఛోక్సీని తిప్పి పంపుతామని భారత్ కు హామీ ఇస్తున్నా
- కాకపోతే దీనికి కొంత సమయం పడుతుంది
- ఛోక్సీ అంగీకరిస్తే.. భారత అధికారులు వచ్చి ఆయనను విచారించుకోవచ్చు
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా దేశంలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. 2018 జనవరిలో ఛోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మెహుల్ ఛోక్సీ నిజాయతీ లేని వ్యక్తి అని ఆయన అన్నారు. అతన్ని భారత్ కు తిప్పి పంపిస్తామని తెలిపారు. ఛోక్సీని తిప్పి పంపుతామని భారత్ కు హామీ ఇస్తున్నానని చెప్పారు. భారత్ లో ఆయనపై ఉన్న కేసులను ఛోక్సీ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కాకపోతే దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. న్యూయార్క్ లో ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మెహుల్ ఛోక్సీ ఓ ఆర్థిక నేరగాడు అనే సమాచారం తమకు అందిందని... ఇలాంటి వ్యక్తి వల్ల తమ దేశ ప్రతిష్ట ఏ మాత్రం పెరగదని బ్రౌనీ అన్నారు. చోక్సీ అంగీకరిస్తే భారత అధికారులు ఇక్కడకు వచ్చి ఆయనను విచారించవచ్చని తెలిపారు. ఇందులో తమ ప్రభుత్వం చేసేదేమీ లేదని చెప్పారు. ఏదేమైనప్పటికీ... భారత అధికారులు అందించిన సమాచారం మేరకే చోక్సీకి తమ అధికారులు పౌరసత్వాన్ని ఇచ్చారని... దీనికి భారత అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.