UNSC: హఫీజ్ సయీద్ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు.. సాయం చేయండి: ఐక్యరాజ్య సమితికి పాక్ వేడుకోలు
- ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రకటనలు
- మరోవైపు ముంబయి పేలుళ్ల సూత్రధారికి సాయం కోసం అర్ధింపు
- సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2012లోనే ప్రకటన
ఉగ్రవాదంపై తొలి నుంచీ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్న దాయాది పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కు ఆర్థిక సాయం చేయాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అభ్యర్థించింది.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అనంతరం హఫీజ్ బ్యాంకు ఖాతాలను పాకిస్థాన్ ప్రభుత్వం నిలిపివేయక తప్పలేదు. దీనివల్ల తన కుటుంబం కనీస అవసరాలకు కూడా డబ్బులులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని వేడుకోగా, విషయాన్ని పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి తీసుకువెళ్లింది.
నెలకు కనీసం రూ.1.5 లక్షల పాకిస్థాన్ రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి అంగీకరించినట్లు సమాచారం.