Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నారు
- కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు
- పొరుగు రాష్ట్రాల సీఎంలకు,మంత్రులకు అంత విలువైన బహుమతులిస్తారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు కోట్ల రూపాయల విలువైన వెండి వస్తువులను బహుమతులుగా ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
బడ్జెట్ విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గాల్లో లెక్కలు వేసిందని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు. ‘మేకిన్ ఇండియా’కు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి పెంచేందుకు చాలా ఏళ్ల తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేశామని అన్నారు.