Ayyanna Patrudu: ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారు: అయ్యన్న ఫైర్
- ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తారా? అంటూ ఆగ్రహం
- రైతు రుణమాఫీ జీవో రద్దు అన్యాయం అంటూ వ్యాఖ్యలు
- చంద్రబాబుపై కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హితవు
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతు రుణమాఫీ రద్దుపై ఘాటుగా స్పందించారు. రైతు రుణమాఫీ జీవో రద్దు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమలులో ఉన్న పథకాలను కొనసాగించాలని అన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తారా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారు అని హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని అయ్యన్న వ్యాఖ్యానించారు. సుజల స్రవంతి టెండర్ ఎందుకు రద్దు చేశారో చెప్పలేకపోయారని విమర్శించారు.