Telugudesam: విద్యుత్ ఒప్పందాలపై అనవసర రాద్ధాంతంతో అభాసుపాలయ్యారు: కళా వెంకట్రావు
- జగన్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది
- సమీక్షల పేరిట కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు
- పీపీఏలపై అనవసర రాద్ధాంతంతో అభాసుపాలయ్యారు
వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తోందని, సీఎం జగన్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమీక్షల పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, విద్యుత్ ఒప్పందాలపై అనవసర రాద్ధాంతంతో అభాసుపాలయ్యారని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకుడు కూన రవిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వానికి కార్మికుల ఉసురు తగులుతుంది: డొక్కా
టీడీపీకి చెందిన మరో నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, ఇసుక కొరత మినీ నోట్ల రద్దు లాంటిదని విమర్శించారు. ఇరవై లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వైసీపీ ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికుల ఉసురు తగులుతుందని, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే ప్రభుత్వాన్ని నడపడమా? అన్న క్యాంటీన్లు మూసివేసి ప్రభుత్వం ఏం సాధించింది? అని ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్ పథకంపై నిప్పులు పోశారని మండిపడ్డారు.