Hyderabad: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం..పోలీసుల అదుపులో నిందితుడు!
- కరీంనగర్ జిల్లా వాసి మహ్మద్ మొయినుద్దీన్ చిస్తీ
- ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు
- బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ మోసం
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ మొయినుద్దీన్ చిస్తీ (44) కొంత కాలంగా అత్తాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులతో తనకు పరిచయం ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతుండేవాడు.
అతను చెప్పిన ఈ మాటలను పలువురు నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వ్యక్తులు నమ్మారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన జాఫర్ నిజాముద్దీన్ ఖాన్, వసీ అహ్మద్, అబ్దుల్ ఖాదర్ లు తమకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ అతనికి మొత్తం రూ.31.75 లక్షలు ఇచ్చారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి ఉద్యోగాలు వచ్చినట్టుగా నకిలీ ఉత్తర్వుల ప్రతులను వారికి అందజేసేవాడు.
ఆ పత్రాలతో ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన వారికి అవి నకిలీ ఉత్తర్వులన్న విషయం అర్థమైంది. దీంతో, హబీబ్ నగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు మొయినుద్దీన్ ని నిన్న అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.