Astra: అగ్రదేశాల సరసన భారత్ ను నిలిపిన 'అస్త్ర'!
- డీఆర్ డీవో అభివృద్ధి చేసిన సరికొత్త ఆయుధం
- ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లలో మేటి!
- మాక్ 4.5 వేగాన్ని మించి ప్రయాణం
భారత రక్షణ రంగ అవసరాలను తీర్చుతున్న డీఆర్ డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) తయారుచేసిన సరికొత్త ఆయుధం అస్త్ర. భారత మిసైల్ చరిత్రలో ఇదో బ్రహ్మాస్త్రం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న అస్త్ర త్వరలోనే భారత వాయుసేనలో చేరేందుకు సంసిద్ధంగా ఉంది. కంటికి కనిపించని దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లకు ఇది దీటుగా నిలుస్తుంది. త్వరలోనే దీన్ని లాంగ్ రేంజ్ మిసైల్ గా మలిచేందుకు డీఆర్ డీవో కృషి చేస్తుందని డీఆర్ డీవో చీఫ్ డాక్టర్ జి సతీశ్ రెడ్డి తెలిపారు.
ఈ తరహా మిసైళ్లు ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అస్త్ర కారణంగా భారత్ కూడా ఆ దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అస్త్ర క్షిపణి మాక్ 4.5 వేగానికి నాలుగు రెట్లు అధికవేగంతో ప్రయాణిస్తుంది. అన్ని రకాల వాతావరణాల్లోనూ గురితప్పకుండా లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణులు భారత వాయుసేనలో సుఖోయ్, తేజాస్ విమానాలకు అతికినట్టు సరిపోతాయి. మార్గమధ్యంలో తప్పుదారి పట్టించేందుకు ప్రత్యర్థి యుద్ధవిమానాలు చేసే గిమ్మిక్కులను కూడా అస్త్ర సమర్థంగా ఎదుర్కొని పనిపూర్తిచేస్తుంది.