Pakistan: పాక్ యుద్ధం కోరుకుంటున్నట్టుంది...సరైన బుద్ధి చెబుతాం: ఆర్మీ చీఫ్ బిపిన్‌రావత్
- ప్రధాని ఇమ్రాన్ హద్దుమీరి మాట్లాడుతున్నారు
- దాగుడు మూతలకు దాయాది దేశం స్వస్తిపలకాలి
- ఇప్పటికీ ఆ దేశం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది
కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది పాకిస్థాన్, భారత్‌తో యుద్ధమే కోరుకుంటున్నట్లు వ్యవహరిస్తోందని, అదే జరిగితే సరైన బుద్ధి చెబుతామని భారత ఆర్మీ అధిపతి బిపిన్ రావత్ హెచ్చరించారు. అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కశ్మీరీలు జిహాద్ (పవిత్ర యుద్ధం) చేస్తున్నారని, పాకిస్థాన్ వారికి అండగా ఉంటే వారు విజయం సాధిస్తారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై బిపిన్ రావత్ మండిపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్ దాగుడుమూతలు ఆడుతోందన్నారు. ఇటువంటి చర్యలు ఎల్లకాలం సాగవని, మెరుపుదాడులతో భారత్ ఏంటో ఆ దేశానికి ఇప్పటికే తెలిసి వచ్చిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ హద్దు మీరి ప్రవర్తిస్తే భారత్ సరిహద్దు దాటడానికి వెనుకడుగు వేయదని హెచ్చరించారు.
భూ, వాయు మార్గాల్లో దాడులు చేసి ఆ దేశానికి బుద్ధి చెబుతామని తెలిపారు. యుద్ధం అంటూ వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.