Jagan: మనకు ఓటు వేయని వారు కూడా మనకు ఓటు వేసేలా పని చేయండి: కొత్త ఉద్యోగులకు జగన్ సూచన
- కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి
- గ్రామ వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తాం
- జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి
గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ నేడు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పాలన వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని... గ్రామాలు పూర్తి స్థాయిలో మెరుగు పడేలా పని చేయాలని ఉద్యోగులను కోరారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు. మనకు ఓటు వేయనివాడు కూడా మనం చేసే మంచిని చూసి మనకు మళ్లీ ఎలెక్షన్లల్లో ఓటేసేటట్టుగా చేయాలని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోమని కోరుతున్నానని తెలిపారు.
సచివాలయ వ్యవస్థలో 500లకు పైగా సేవలు ఉంటాయని, 34 శాఖలకు చెందిన పనులు జరుగుతాయని జగన్ అన్నారు. ప్రతి గ్రామ వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్ అందజేస్తామని చెప్పారు. జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని... అదే రోజు నుంచే కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు.