Jagan: జగన్‌ను ‘దేవుని బిడ్డ’గా కీర్తించిన ఏపీ పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్
- జగన్‌ను ఆకాశానికెత్తేసిన విజయకుమార్
- గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెస్తున్నారని కొనియాడిన వైనం
- నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం కారుచీకట్లో కాంతిరేఖలా మారిందని ప్రశంస
విజయవాడలో సోమవారం జరిగిన గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పురపాలకశాఖ కమిషనర్ జేఎస్సార్కే ఆర్ విజయకుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి. సచివాలయ వ్యవస్థను సంకల్పించడం ద్వారా జగన్ స్థానిక పరిపాలన వ్యవస్థలో ‘సెప్టెంబరు రివల్యూషన్’ను తీసుకొచ్చారని ప్రశంసించిన విజయకుమార్.. జగన్‌ను ‘దేవుడి బిడ్డ’ అని కీర్తించారు. అశోకుడికి ‘దేవతలు మెచ్చిన రాజు’ అనే బిరుదు ఉండేదని, అలానే ఏపీని జనరంజకంగా పాలిస్తున్న జగన్ ఇప్పుడు ‘దేవుడి బిడ్డ’ అయ్యారని పేర్కొన్నారు.
స్థానిక సుపరిపాలన ద్వారా జగన్ గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెస్తున్నారని కొనియాడారు. కారు చీకట్లో కాంతి రేఖలా జగన్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాల భర్తీ చేపట్టి యువతను ప్రభుత్వ ఉద్యోగులను చేసిందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ గురించి విజయకుమార్ చెబుతూ, ఆయనను సునిశిత మేధావిగా, ఏకసంథాగ్రాహిగా అభివర్ణించారు.