Pawan Kalyan: గాంధీ కోరుకున్న సుపరిపాలన అందించడమే నిజమైన నివాళి: పవన్ కల్యాణ్
- రేపు మహాత్ముడి 150వ జయంతి
- పవన్ ప్రత్యేక సందేశం
- మహాత్ముడి మార్గం సదా ఆచరణీయం అన్న పవన్
అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సందేశం అందించారు. మహాత్ముని మార్గం సదా ఆచరణీయం అంటూ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అనే పేరు స్మరించుకుంటే చాలని, భారతీయుల మనసంతా పవిత్రంగా మారిపోతుందని తెలిపారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసింది గాంధీయేనని, ఆయన 150వ జయంతిని ప్రతి ఒక్క భారతీయుడు ఓ వేడుకలా జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఐన్ స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మేధావులను సైతం గాంధీజీ ప్రభావితం చేశారని, ఆయన బోధించిన అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆయుధాలు, స్వతంత్ర సాధనలో ఆయన అనుసరించిన మార్గాలు ఇవాళ్టికీ ఆచరణీయమేనని కొనియాడారు. ఆ మహనీయుడు కోరుకున్న సుపరిపాలన అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.