Bihar: నదిలో బోల్తాకొట్టిన ట్యూబు బోటు.. బీహార్‌ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం

  • వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఘటన
  • నదిలోకి పడిపోయిన పాటలీపుత్ర ఎంపీ రామ్‌కృపాల్‌ యాదవ్‌
  • స్థానికులు అప్రమత్తమై రక్షించిన వైనం

వరదలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్న బాధితులను పరామర్శించి వారి క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు బయలుదేరిన ఎంపీ తానే బాధితుడయ్యారు. బోటులో ప్రయాణిస్తూ నదిలోకి జారిపోయారు. స్థానికులు అప్రమత్తమై రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.

వివరాల్లోకి వెళితే... బీహార్‌ రాష్ట్రంలోని పాటలీపుత్ర ప్రాంతం ప్రస్తుతం వరద బీభత్సంతో అతలాకుతలమవుతోంది. తన నియోజకవర్గం పరిధిలోని బాధితులను పరామర్శించేందుకు కేంద్ర మాజీ మంత్రి, స్థానిక ఎంపీ రామ్‌కృపాల్‌యాదవ్‌ ట్యూబులతో రూపొందించిన బోటులో బయలుదేరారు.

ధనురువా గ్రామ బాధితులను పరామర్శించేందుకు బుధవారం రాత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి ఆవల గట్టున గ్రామం ఉండడం, ఆ సమయానికి బోటు ఏదీ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్థులు నది దాటేందుకు ఉపయోగించే టైర్ల ట్యూబుతో రూపొందించిన పడవపై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయనపాటు మరికొందరు ఆ బోటు ఎక్కారు.

సామర్థ్యానికి మించి జనం ఉండడంతో బోటు అదుపుతప్పి నదిలో పడిపోయారు. దీంతో కొట్టుకుపోతున్న ఎంపీని స్థానికులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాలకు సాయం అందించడానికే పరిమితమయ్యిందని, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

స్థానిక ప్రజాప్రతినిధిగా తాను గ్రామాల సందర్శనకు వెళ్లడానికి బోటు కూడా అందుబాటులో లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు. అందుకే ట్యూబుల బోటు ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News