Botsa Satyanarayana: దేవుడి దగ్గర ఆ విషయాల గురించి మాట్లాడను: బొత్స సత్యనారాయణ
- ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ తగ్గలేదు
- భక్తులకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలను చేపట్టాం
- దేవినేని ఉమావి రాజకీయపరమైన ఆరోపణలు మాత్రమే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీసమేతంగా విచ్చేశారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని, పూజలను నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాలకు, ఆయన చేయాలనుకుంటున్న మంచి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, నిర్విఘ్నంగా కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
ఈ ఏడాది కొండపై భక్తుల సంఖ్య తక్కువగా ఉందనే వార్తలను బొత్స ఖండించారు. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని, భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలను చేపట్టామని, దీంతో భక్తులంతా చాలా ఫ్రీగా అమ్మవారిని దర్శనం చేసుకుని, తొందరగా వెళ్తున్నారని చెప్పారు. గుడి వద్ద ఫ్లెక్సీలు ఎక్కువగా ఉన్నాయి, విషయం తక్కువగా ఉందంటూ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, అవన్నీ రాజకీయపరమైన ఆరోపణలు మాత్రమేనని అన్నారు. దేవుడి దగ్గర తాను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు.