Pragathi Bhavan: ప్రగతి భవన్ లో మీరు పండగ చేసుకుంటారు.. ఆర్టీసీ కార్మికులు చేసుకోవద్దా?: జీవన్ రెడ్డి
- ఆర్టీసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయి ఎండీని కూడా నియమించలేదు
- సచివాలయానికి పెట్టే ఖర్చుతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చవచ్చు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని కూడా నియమించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రైవేటు వాహనాలను తగ్గిస్తామని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని... కానీ, ఈ ఐదేళ్లలో ప్రైవేటు వాహనాల సంఖ్య మరో 5 శాతం పెరిగిందని చెప్పారు. ఆర్టీసీ నష్టాల ఊబిలోకి జారుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని జీవన్ రెడ్డి అన్నారు. వేతన సవరణ కాలపరిమితి ముగిసి 30 నెలలు గడిచినప్పటికీ ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. మీరేమో ప్రగతి భవన్ లో దసరా పండుగ చేసుకుంటారు... ఆర్టీసీ కార్మికులు జరుపుకోవద్దా? అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు.
ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏనాడూ సచివాలయానికి రారని... అందువల్ల కొత్త సచివాలయ నిర్మాణం అవసరం లేదని అన్నారు. సచివాలయానికి పెట్టే ఖర్చుతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చవచ్చని జీవన్ రెడ్డి సూచించారు.