Ravi Prakash: ఖైదీ నంబర్ 4412... చంచల్ గూడా జైల్లో సాధారణ ఖైదీగా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్!
- గత రాత్రి 10 గంటలకు చంచల్ గూడా జైలుకు
- రాత్రి సరిగ్గా నిద్రపోని రవిప్రకాశ్
- పొద్దున్నే కిచడీని ఇచ్చిన అధికారులు
నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ తెలుగు చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను, గత రాత్రి చంచల్ గూడా జైలుకు తరలించగా, ఆయన్ను ఓ సాధారణ ఖైదీ మాదిరే పరిగణించిన అధికారులు సింగిల్ బ్యారక్ లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాశ్ నిద్రపోలేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆయనకు మిగతా ఖైదీలకు ఇచ్చినట్టుగానే కిచడీని అల్పాహారంగా అందించామని, ఆయన దాన్ని అయిష్టంగానే తీసుకుని సరిగ్గా తినలేదని సమాచారం.
ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 4412ను కేటాయించామని, కృష్ణా బ్యారక్ లో ఉంచామని, ఆయన్ను చూసిన ఇతర ఖైదీలు మాట్లాడించాలని ప్రయత్నించినా, ముభావంగా ఉన్నాడని జైలు సిబ్బంది తెలిపారు. కాగా, నిన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించిన అనంతరం, రాత్రి 10 గంటలకు రవిప్రకాశ్ ను జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.