Batukamma: తెలంగాణలో... కిలో చామంతి కేవలం రూ. 600 మాత్రమే!
- సాధారణ రోజుల్లో కిలో రూ. 250
- బతుకమ్మ కారణంగా రేట్లు రెండింతలు
- కొన్ని పూలతోనే సరిపెట్టుకుంటున్న మహిళలు
తెలంగాణలో నేడు సద్దుల బతుకమ్మ కాగా, పూలకు, ముఖ్యంగా బతుకమ్మకు మహిళలు ఇష్టంగా అలంకరించే చామంతి పూలకు రెక్కలు వచ్చాయి. మామూలు రోజుల్లో కిలో రూ. 250 నుంచి రూ. 300కు లభించే చామంతి, ఏకంగా రూ. 600 వరకూ వెళ్లిపోయింది.
ఇక సాధారణ రోజుల్లో రూ. 50కి లభించే కిలో బంతిపూల ధర ఇప్పుడు రూ. 100 దాటేసింది. ముఖ్యంగా బతుకమ్మ పండగను వైభవంగా జరుపుకునే వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ప్రతి ఏటా కిలో పూలు కొని బతుకమ్మను అలంకరించే మహిళలు, ఈ సంవత్సరం అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. పూల సరఫరా తగ్గడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.