India: దేశంలోకి చొరబడిన 300 మంది ఉగ్రవాదులు!
- కాల్పులు జరుపుతూ కవ్విస్తున్న పాక్
- అదే సమయంలో సరిహద్దులు దాటుతున్న ఉగ్రవాదులు
- వెల్లడించిన జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్
పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి దాదాపు 300 మంది వరకూ టెర్రరిస్టులు ఇండియాలోకి చొరబడ్డారని జమ్మూ కశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఎల్ఓసీ వెంట పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్, కాల్పులు జరుపుతున్న వేళ, ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందని ఆయన అన్నారు. పూంచ్ జిల్లాలో భద్రతపై సమీక్షించేందుకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, కంచక్, ఆర్ఎస్ పుర, రాజౌరి, హీరానగర్, యూరి, నంబాల, కర్నాహ్, కేరన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి వచ్చారని తెలిపారు.
కవ్వింపు కాల్పులకు పాల్పడుతున్న పాక్ రేంజర్లు, అదే సమయంలో భారత సైనికుల దృష్టిని మరల్చి ఉగ్రవాదులను పంపిస్తున్నారని తెలిపారు. వీరిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, గుల్ మార్గ్ సెక్టారులోని గందర్ బల్ సమీపంలో జరిపిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులు దొరికారని అన్నారు. ఎల్ఓసీ వెంబడి జరిపిన ఎన్ కౌంటర్లలో కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. అక్రమంగా చొరబడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేయడమే తమ లక్ష్యమని దిల్ బాగ్ సింగ్ అన్నారు.