HSBC: ఖర్చు తగ్గించుకునే పనిలో హెచ్ఎస్బీసీ.. భారీగా ఉద్యోగులకు ఉద్వాసన?
- పది వేల మందిని తొలగించే అవకాశం
- ఉన్నత ఉద్యోగులపైనే వేటుంటుందని అంచనా
- మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడి?
ఐరోపాలో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ త్వరలోనే ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నిర్వహణ భారం తగ్గించుకునే పనిలో పడిన సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులపైనే ఎక్కువగా వేటువేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగస్టులో సంస్థ సీఈఓ జాన్ఫ్లింట్ని తొలగించి ఆయన స్థానంలో క్విన్ని నియమించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటేనే మంచిదన్న భావన ఉందని, అందులో భాగంగానే ఈ నిర్ణయమని అప్పట్లో యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయాల్లో భాగంగానే పది వేల మంది వరకు ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు వెల్లడించే సందర్భంలో సంస్థ ఈ నిర్ణయాన్ని తెలిపే అవకాశం ఉంది.