Telangana: పన్నుల భారాన్ని తగ్గించి టీఎస్సార్టీసీని కాపాడుకోవచ్చు: రేవంత్ రెడ్డి
- టీఎస్సార్టీసీ నష్టాలకి ప్రభుత్వ విధానాలే కారణం
- ఆర్టీసీ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుంది
- ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ
టీఎస్సార్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పన్నుల భారాన్ని తగ్గించి ఆర్టీసీని కాపాడుకోవచ్చని సూచించారు. డీజిల్ పై పన్నులతో ఆర్టీసీ కోలుకోలేకపోతోందని, దీనిపై వ్యాట్ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని, స్పేర్ పార్ట్స్ పై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్ పాస్ రాయితీలకు సంబంధించి ఆర్టీసీకి రూ.700 కోట్లు ప్రభుత్వం బకాయిపడిందని అన్నారు.
నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూస్తున్నారని, అసలు, ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న ఆలోచన కేసీఆర్ కు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న ఆలోచన వచ్చిందని ఆరోపించారు. ‘మేఘా’ ప్రణాళికతోనే ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు పథక రచన చేస్తున్నారని ధ్వజమెత్తారు.