Vizag: వైజాగ్ ఎయిర్ పోర్టు సిబ్బంది తప్పిదం.... తడిసిముద్దయిన టీమిండియా క్రికెటర్లు, కుటుంబ సభ్యులు
- ఎయిర్ పోర్టులో ఆటగాళ్లకు అసౌకర్యం
- ప్లాట్ ఫామ్ నెం.3 వద్దకు ఆటగాళ్ల బస్సు
- పైకప్పు లేకపోవడంతో వర్షంలో తడిసిన ఆటగాళ్లు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టుకు వైజాగ్ నగరం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా, ఆదివారం మ్యాచ్ ముగియగా, సోమవారం రెండు జట్లు పుణే నగరానికి బయల్దేరాయి. ఎయిర్ పోర్టుకు చేరుకునేంతలో భారీ వర్షం కురిసింది.
ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో ప్లాట్ ఫామ్ నెం.1 వద్దకు టీమిండియా క్రికెటర్ల బస్సును అనుమతించాల్సి ఉండగా, విమానాశ్రయ భద్రతా సిబ్బంది దక్షిణాఫ్రికా క్రికెటర్లున్న బస్సును అనుమతించారు. భారత క్రికెటర్లున్న బస్సును ప్లాట్ ఫామ్ నెం.3 వద్దకు పంపారు. అక్కడ పైకప్పు లేకపోవడంతో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు వర్షంలో తడిసిపోయారు. ఈ విషయమై రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు సీఐని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆటగాళ్లు తమ లగేజీతో వర్షంలో అసౌకర్యానికి గురైనట్టు సమాచారం.