Yes Bank: వాటాలమ్ముతున్నారని తెలియగానే... యస్ బ్యాంక్ ఈక్విటీ వాల్యూ ఢమాల్!
- యస్ బ్యాంక్ లో వాటాల విక్రయం
- నశించిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 8 శాతం నష్టపోయిన విలువ
మూలధనం నిధుల సమీకరణ పేరిట వాటాలను విక్రయించేందుకు యస్ బ్యాంక్ ప్రయత్నిస్తోందని, మైక్రోసాఫ్ట్ సహా మూడు కంపెనీలు బ్యాంకుతో చర్చిస్తున్నాయని వచ్చిన వార్తలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కుంగదీశాయి. వాస్తవానికి వాటాల విక్రయం వార్త మంగళవారమే వెలుగులోకి రాగా, దసరా సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్వెస్టర్ల స్పందన కనిపించలేదు.
ఇక ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభం కాగానే, ప్రధాన సూచికలు స్థిరంగా కొనసాగుతున్న వేళ, యస్ బ్యాంక్ ఈక్విటీ విలువ దారుణంగా పడిపోయింది. సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో ఏకంగా 8 శాతం నష్టపోయింది. ఈక్విటీలను అమ్మి సొమ్ము చేసుకునేందుకే ఇన్వెస్టర్లు ప్రయత్నించారు.
ఇక ఈ ఉదయం సెన్సెక్స్ 15 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతికూలాంశాలే అధికంగా ఉండటంతో తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్, నిఫ్టీలు సాగవచ్చని అంచనా. ఇక ఉదయం సెషన్ లో ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ , ఎన్టీపీసీ, మారుతి ఈక్విటీలు లాభాల్లోనూ, హెచ్సీఎల్, టీసీఎస్, యూపిఎల్, గ్రాసిమ్, యాక్సిస్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ నష్టాల్లోనూ నడుస్తున్నాయి.