Jolly: వరుస హత్యల జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ: కేరళ డీజీపీ
- జాలీకి సైకో ఎనాలిసిస్ పరీక్షలు
- విచారణలో సైకాలజిస్టుల సహకారం
- కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా
జాలీ... పైకి చలాకీగా నవ్వుతూ కనిపిస్తుంది. అందరితోనూ చక్కగా మాట్లాడుతుంది. మంచి గృహిణిగానూ పేరు తెచ్చుకుంది. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరో వైపు చూస్తే, 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసింది. ఇప్పుడీ కేసు కేరళతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, కేసును స్వయంగా విచారిస్తున్న డీజీపీ లోక్ నాథ్ బెహరా కీలక వ్యాఖ్యలు చేశారు.
జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నామని, ఒక్కో సమయంలో సైకోగా మారే ఆమె, తినే ఆహారంలో సైనైడ్ కలుపుతూ ఒక్కొక్కరినీ మట్టుబెట్టిందని, ఆమెకు సైకో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నామని లోక్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు పోలీసులకు చాలా సంక్లిష్టమైనదని, విచారణకు మంచి సైకాలజిస్టుల సాయం తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు.
ఇదిలావుండగా, జాలీ బంధువులు మాత్రం, ఆమె అమాయకురాలని చెబుతుండటం గమనార్హం. ఆమెను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాలీ స్నేహితులు కూడా ఆమె వరుస హత్యలు చేసిందంటే నమ్మలేకున్నామని అంటున్నారు.