Tamilnadu: రూ. కోటి నష్ట పరిహారం కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన శుభశ్రీ తండ్రి!
- ప్లెక్సీ మీదపడగా రోడ్డు ప్రమాదం
- తీవ్ర గాయాలతో మరణించిన శుభశ్రీ
- మద్రాస్ హైకోర్టులో శుభశ్రీ తండ్రి పిటిషన్
ఓ బ్యానర్ గాలికి ఎగిరి వచ్చి పడటం ద్వారా తన కుమార్తె మరణించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న శుభశ్రీ తండ్రి రవి, ఇకపై ఇలా జరగకుండా కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో అనుమతి లేకుండా బ్యానర్లు కట్టే వాళ్లను కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని రూపొందించాలని కూడా కోరారు. ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని తన పిటిషన్ లో ఆయన కోరారు.
కాగా, గత నెల పల్లావరం సమీపంలో శుభశ్రీ మీద బ్యానర్ పడటం, దీంతో ఆమె ద్విచక్ర వాహనం అదుపు తప్పగా, పక్క నుంచి వెళుతున్న నీళ్ల ట్యాంకర్ కిందపడిన ఆమెపై నుంచి వెళ్లడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారాన్నే లేపింది. ఘటన తరువాత ఫ్లెక్సీలు, బ్యానర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించే పనిలో పడింది.
శుభశ్రీ మరణానికి కారణమైన బ్యానర్ ను కట్టిన అధికార పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు కూడా. కెనడా వెళ్లి ఉద్యోగం చేసి, తమ కుటుంబాన్ని ఆదుకుంటుందన్న ఆలోచనలో ఉన్న శుభశ్రీ కుటుంబీకులు, ఈ ఘటన తరువాత శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఫ్యామిలీకి తాత్కాలిక సాయంగా ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.