India: పూణే టెస్ట్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!
- నేటి నుంచి పూణేలో రెండో టెస్ట్
- హనుమ విహారి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి
- సీమర్లకు అనుకూలిస్తుందన్న భావనలోనే
- వెల్లడించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. విశాఖలో జరిగిన తొలి టెస్టులో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ ను సాధించాలన్న పట్టుదలతో ఉంది.
టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, విశాఖ పిచ్ తో పోలిస్తే, పూణే పిచ్ మరింత హార్డ్ గా ఉందని, రివర్స్ సీమ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని అన్నాడు. ఈ కారణంతో హనుమ విహారి స్థానంలో ఉమేశ్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. షమీ, ఉమేశ్ లు ఈ పిచ్ పై మరింత పదునైన బాల్స్ వేయగలరని నమ్ముతున్నామని అభిప్రాయపడ్డాడు.
ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ, ఈ పిచ్ పై తొలుత బౌలింగ్ చేయడం తమకేమీ ఇబ్బంది కలిగించే అంశమేమీ కాదన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టును సాధ్యమైనంత తక్కువ పరుగులకు అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, ఈ మ్యాచ్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి 50వ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్ లలో ఇంతవరకూ ఒక్క సెంచరీని కూడా సాధించని కోహ్లీ, ఈ మ్యాచ్ లో ఆ కోరికను నెరవేరుస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.