Jagan: జగన్ వైఖరి చూస్తుంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు లేదు: కన్నా
- వైసీపీ కార్యకర్తలకు పంపకాలు బాగానే చేస్తున్నారు
- నాలుగు నెలల్లో పోలవరంలో ఏం చేశారో చూస్తాం
- తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల విషయంలో జగన్ చొరవ చూపాలి
ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపించడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ కార్యకర్తలకు పంపకాలు బాగానే చేస్తున్నారు కదా అని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైందని... ఈ సమయంలో పోలవరంలో ఏం చేసిందో చూస్తామని చెప్పారు.
ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడం మంచిదేనని... అయితే, ప్రాజెక్టు నాణ్యత గురించి కూడా ఆలోచించాలని అన్నారు. మొత్తం ప్రాజెక్టు పూర్తైనప్పుడే... వ్యయం తగ్గిందా? పెరిగిందా? అనేది కచ్చితంగా తెలుస్తుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపాలని అన్నారు. కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో, విభజన అంశాలను త్వరగా పరిష్కరించుకునేందుకు యత్నించాలని సలహా ఇచ్చారు.