Karnataka: కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు
- మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర, జాలప్పలకు షాక్
- ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు
- కుట్రతోనే దాడులని సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆగ్రహం
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. పార్టీ సీనియర్ నేత పరమేశ్వర, మరో నేత ఆర్.ఎల్.జాలప్ప ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వైద్య కళాశాల ప్రవేశాల సమయంలో పరమేశ్వర భారీ ఎత్తున బ్లాక్మనీ వ్యవహారాన్ని నడిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు చెందిన 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారని చెప్పుకుంటున్నారు. తనిఖీల అనంతరం పరమేశ్వరకు చెందిన తుముకూరులోని సిద్ధార్థ గ్రూప్ విద్యా సంస్థను అధికారులు సీజ్ చేశారు.
కాగా, ఈ దాడులను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. కుట్రతోనే ఈ దాడులు నిర్వహించారని, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వారిపై ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.