Bigg Boss: షోలో పాల్గొంటున్న వారు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు: 'బిగ్ బాస్'పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
- కుటుంబం చూసే విధంగా బిగ్ బాస్ లేదు
- షో చాలా అసభ్యకరంగా ఉంటోంది
- ఇలాంటి కార్యక్రమాలపై సెన్సార్ ఉండాలి
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ కార్యక్రమంపై ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుజ్జార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో అసభ్యకరంగా ఉంటోందని, కుటుంబం చూడదగిన రీతిలో లేదని ఆరోపిస్తూ కేంద్ర ప్రసారశాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా షో ఉందని... షోలో పాల్గొంటున్న ఆడ, మగ కంటెస్టెంట్లు చాలా సన్నిహితంగా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. షోలో పాల్గొంటున్న వారు బెడ్ పార్టనర్స్ అయ్యేలా షో ఉంటోందని... ఇది ఎంతమాత్రం అంగీకరించలేని విషయమని చెప్పారు. ఓవైపు భారత్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రధాని మోదీ యత్నిస్తుంటే... మరోవైపు ఇలాంటి షోలు ఆ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలపై సెన్సార్ ఉండాలని అన్నారు. ఈ షోలలోని అడల్ట్ కంటెంట్ చిన్నారులు, మైనర్లను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పారు.