Telugudesam: టీడీపీ మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోంది: పంచుమర్తి అనూరాధ
- ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు
- అఖిలప్రియ భర్త భార్గవ్ పై 307 కేసు ఎలా పెట్టారు?
- కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాలి
టీడీపీ మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోందని విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనూరాధ ఆరోపించారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టీడీపీ మహిళా నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వారిపై దాడికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ పై 307 కేసు ఎలా పెట్టారు? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆమె విమర్శలు చేశారు. ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడం, బెయిల్ మంజూరు కావడం అంతా ఓ డ్రామా అని విమర్శించారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డిపై బాధితురాలు సరళ ఫిర్యాదు చేస్తూ ఐదు పేజీలు రాశారని, ఈ మేరకు వైసీపీ పాలన ఎలా ఉందో తెలిసిపోతోందని విమర్శించారు.
నాడు టీడీపీ హయాంలో ప్రభుత్వ అధికారి వనజాక్షికి ఎటువంటి అన్యాయం జరగలేదని, అదే, సరళ విషయంలో అన్యాయం జరిగినా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా కచ్చులూరులో పడవ ప్రమాద ఘటన గురించి ఆమె ప్రస్తావించారు.