tomato: వీర్య కణాల వృద్ధికి టమాటా దివ్యౌషధం.. పరిశోధనలో వెల్లడి
- టమాటాల్లో లైకోపీన్ సమ్మేళనం
- బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో అద్భుత ఫలితాలు
- ల్యాక్టోలైకోపీన్ తీసుకున్న వారిలో 40 శాతం వీర్యకణాల వృద్ధి
వీర్యలేమితో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. వీర్యవృద్ధికి టమాటా దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టమాటాల్లో సహజ సిద్ధంగా ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం వీర్యవృద్ధిని విశేషంగా పెంచుతుందని బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. టమాటాలతోపాటు ఇతర పండ్లలోనూ ఈ సమ్మేళనం ఉన్నప్పటికీ దానిని శరీరం నేరుగా శోషించుకోలేదు. దీంతో ఉడికించిన టమాటాల నుంచి సేకరించిన లైకోపీన్పై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. దీనిని వాణిజ్యపరంగా ‘ల్యాక్టోలైకోపీన్’గా వ్యవహరిస్తారు.
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 19-30 మధ్య వయసున్న 60 మందిని ఎంపిక చేసుకుని వారిని రెండు వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గానికి 12 వారాలపాటు ప్రతి రోజూ ల్యాక్టోలైకోపీన్ను అందించారు. అనంతరం వారి వీర్యాన్ని పరీక్షించగా ఆరోగ్యకరమైన వీర్యకణాలు 40 శాతం అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. అంతేకాదు, వీర్యకణాల ఆకృతి, పరిమాణం కూడా మెరుగుపడినట్టు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.