tulasireddy: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిందే: తులసిరెడ్డి
- ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు
- ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని పాటించాలి
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో తులసిరెడ్డి డిమాండ్
అధికార, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని కోస్తాలో ఏర్పాటు చేశారు కాబట్టి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాజధానిని ఓ ప్రాంతంలో, హైకోర్టును మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
1953లో ఆంధ్రరాష్ట్ర అవతరణ నాటి సంప్రదాయాన్ని పాటించి అధికార, అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని తులసిరెడ్డి కోరారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయిన తర్వాత కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తులసిరెడ్డి గుర్తు చేశారు. యూపీ హైకోర్టు అలహాబాద్‌లో ఉండగా, రాజధాని లక్నోలో హైకోర్టు బెంచి మాత్రమే ఉందని ఈ సందర్భంగా తులసిరెడ్డి పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడమే న్యాయమని తులసిరెడ్డి పేర్కొన్నారు.