Andhra Pradesh: కార్మికులకు అండగా నిలబడి నిరసన తెలియజేయడం తప్పా?: టీడీపీ నేత కళావెంకట్రావు
- టీడీపీ నేతల దీక్షను భగ్నం చేయడం కరెక్టు కాదు
- ఇసుక కృత్రిమ కొరతతో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు
- సీఎం జగన్ కి చీమకుట్టినట్టు కూడా లేదు
ఏపీ వ్యాప్తంగా ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ దీక్ష చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన ఇసుక కృత్రిమ కొరతతో ముప్పై లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ధ్వజమెత్తారు. కార్మికులకు అండగా నిలబడి నిరసన తెలియజేయడం తప్పా? అని ప్రశ్నించారు.144 సెక్షన్ అమలు చేసి దీక్షను అడ్డుకునేందుకు యత్నించడం దారుణమని అన్నారు. లారీ ఇసుకను రూ.80 వేలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ కి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.