Team India: వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన సఫారీలు... పూణే టెస్టుపై పట్టుబిగిస్తోన్న భారత్
- 601/5 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
- తొలి ఇన్నింగ్స్ లో కష్టాల్లో పడిన సఫారీలు
- ఆట చివరికి 3 వికెట్లకు 36 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆటలో 601/5 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, ఆపై దక్షిణాఫ్రికాను ఇబ్బందుల్లోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలు స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు చేజార్చుకున్నారు.
ఓపెనర్లు మార్ క్రమ్ (0), ఎల్గార్ (6) స్వల్ప స్కోర్లకు అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు ఉమేశ్ యాదవ్ ఖాతాలోకి వెళ్లాయి. కొత్తబంతితో ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన తెంబా బవుమా కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బవుమా (8)ను మహ్మద్ షమీ అవుట్ చేశాడు. దాంతో ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 36 పరుగులు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే సఫారీలు ఇంకా 565 పరుగులు వెనుకబడే ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పై పగుళ్లు మరింత పెరిగే అవకాశమున్నందున బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడం పర్యాటక బ్యాట్స్ మన్లకు సవాల్ అనే చెప్పాలి.