america: ఉగ్రవాదులకు పాక్ మద్దతివ్వడం మానుకోవాలి: అమెరికా సెనేటర్
- ఇమ్రాన్ తో చర్చల అనంతరం భారత్ కు మ్యాగి హసన్
- పాక్ తో మేము సంప్రదింపులు జరపాల్సి ఉంది
- పాక్, భారత్ సంయమనం పాటించాలి
ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతును నిలిపేయాలని అమెరికా సీనియర్ సెనేటర్ మ్యాగి హసన్ అన్నారు. 'ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి, స్థిరత్వం స్థాపన ప్రయత్నాల్లో పాక్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. అలాగే, ఉగ్రవాద నిరోధకం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. తాలిబన్లతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలను అరికట్టే విషయంలో మేము పాక్ నాయకత్వంతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాల్సి ఉంది' అని ఆమె వ్యాఖ్యానించారు.
కశ్మీర్ అంశంపై కూడా మ్యాగి హసన్ స్పందించారు. కశ్మీర్ విషయంలో తలెత్తుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో సాయం చేయడానికి మార్గాలు కనుగొనే విషయం తమకు చాలా క్లిష్టతరమని అన్నారు. శాంతి, భద్రతల కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. కాగా, మరో సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ తో కలిసి ఆమె పాక్ లో పర్యటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సైన్యాధిపతి ఖమర్ జావెద్ బజ్వాలతో చర్చించారు. ఈ రోజు వారు భారత్ చేరుకున్నారు. పలు అంశాలపై భారత అధికారులతో చర్చలు జరుపుతారు.