walking: మీలోని వృద్ధాప్య ఛాయలను ఇలా కనిపెట్టేయొచ్చు!
- నడక వేగాన్ని గమనిస్తే తెలిసిపోతుందంటున్న పరిశోధకులు
- 40 ఏళ్లు దాటిన వారు నిదానంగా నడిస్తే వృద్ధాప్యఛాయలు ఉన్నట్లే
- చిత్తవైకల్యానికి గురయ్యే అవకాశం
కొందరిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనపడతాయి. మరి కొందరు మాత్రం.. వయసు మీదపడినప్పటికీ యువకుడిలా చలాకీగా కనపడతారు. అయితే, ఎటువంటి మనుషుల్లో వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయన్న విషయంపై అధ్యయనం చేసిన ఓ అంతర్జాతీయ పరిశోధకుల బృందం తాజాగా వాటి ఫలితాలను వెల్లడించింది. 40 ఏళ్లు దాటిన వారు ఎంత వేగంగా నడుస్తున్నారన్నదాన్నిబట్టి వారిలో వృద్ధాప్య ఛాయలు ఏ మేరకు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించవచ్చని తెలిపింది. అలాగే, వాటిని ఎలా గుర్తించవచ్చో వెల్లడించింది. వారి మెదడు పనితీరును కూడా అంచనా వేయొచ్చని పేర్కొంది.
పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా 45 ఏళ్ల వయసులో ఉన్న వారు నిదానంగా నడుస్తున్నట్లయితే వారిలో త్వరగా వృద్ధాప్యం వచ్చిందని తెలుసుకోవచ్చు. ఈ వృద్ధాప్య తాలూకు సంకేతాలు కేవలం వారి శరీరంలోనే కాకుండా ముఖంలోనూ కనపడతాయి. అలాగే, ఇటువంటి వారి మెదడు పరిమాణం కూడా సాధారణం కంటే చిన్నగా ఉంటుంది. తాము గుర్తించిన ఈ విషయాలు చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఉన్నాయని పరిశోధకులు అన్నారు.
సాధారణంగా వైద్యులు 65 ఏళ్ల వారిలో నడక విధానాన్ని పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని గుర్తిస్తారు. కండరాల ఆరోగ్యం, ఊపిరితిత్తుల పనితీరు, శరీర బ్యాలెన్స్, వెన్నెముక శక్తి, కంటి చూపు వంటి విషయాలను గుర్తించడానికి వారి నడక ఓ సూచికగా ఉపయోగపడుతుంది. అలాగే, మెల్లగా నడిచే అలవాటు ఉన్న వృద్ధులు చిత్తవైకల్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది.
న్యూజిలాండ్‌లో 1970 కాలంలో జన్మించిన 1000 మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాలను గుర్తించారు. వారి శారీరక ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలతో పాటు మెదడు పనితీరును తెలిపే పరీక్షలను అధ్యయనం చేశారు. వారి చిన్నతనంలో చేయించుకున్న వైద్య పరీక్షలనూ పరిశీలించారు. 45 ఏళ్ల వయసులో ఉన్నవారి నడక వేగంలో చాలా మార్పులు ఉన్నాయి. కొందరు సెకనుకు 2మీటర్లు నడుస్తున్నారని, ఈ వయసు వారు నడిచిన వేగంలో ఇదే అత్యధికమని గుర్తించారు. వేగంగా నడుస్తున్న వారి కంటే మెల్లగా నడుస్తున్న వారిలో వృద్ధాప్య ఛాయల తాలూకు సంకేతాలు అధికంగా ఉన్నాయని తేల్చారు. వారి ఊపిరితిత్తులు, రోగ నిరోధక శక్తి వ్యవస్థలు బాగోలేవని గుర్తించారు. మొదటి నుంచీ వారికి ఉన్న ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ఆహార అలవాట్లు ఇందుకు కారణమని చెప్పారు.