Haryana: హర్యానాలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా
- మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఈ నెల 21న ఎన్నికలు
- హర్యానా బీజేపీ మేనిఫెస్టోలో యువతకు ప్రాధాన్యత
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మోదీ, రాహుల్
మహారాష్ట్రతో పాటు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 'సంకల్ప్ పత్ర' పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందించారు.
రాష్ట్రంలో చాలా అధ్యయనం జరిపి అన్ని వర్గాల సంకేమమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు నడ్డా తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,000 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి రూ.3 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే, రైతులకు కూడా ఎటువంటి వడ్డీలేకుండా రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు. హర్యానాను క్షయ వ్యాధి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అన్నారు. ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు 25 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తామని, వృద్ధులకు రూ.3,000 పెన్షను ఇస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.
కాగా, ఇరు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. జల్గావ్, సికోలీలో బీజేపీ నిర్వహించే సభల్లో మోదీ పాల్గొంటున్నారు. లాతూర్, చందివాలీ, ధరావీల్లో రాహుల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, ఇరు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 24న వెల్లడవుతాయి.