Devineni Uma: వీరిద్దరే చూసుకోవడానికి నదీజలాలేమన్నా సొంత వ్యవహారమా?: జగన్, కేసీఆర్ లపై దేవినేని ఉమ విమర్శలు
- నదీజలాలపై సొంత ప్రకటనలు వద్దని హితవు
- ఇదేమీ వ్యక్తిగత పంచాయతీ కాదన్న ఉమ
- జగన్ ను ప్రశ్నించిన వైనం
కోట్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న నదీజలాల వ్యవహారంలో సొంతంగా ప్రకటనలు చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. వారిద్దరే నిర్ణయం తీసుకోవడానికి ఇదేమీ వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు. విభజన చట్టం ప్రకారం నదీజలాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందని, అయితే ఈ మండలిని జగన్, కేసీఆర్ లెక్కలోకి తీసుకోకుండా సొంత వ్యవహారంలా నదీజలాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
చట్టప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటాపై ప్రశ్నించని జగన్, పొరుగు రాష్ట్రం నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఎందుకు కోరడంలేదని నిలదీశారు. వ్యవసాయదారులు, ప్రజల హక్కులు సంరక్షించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని, కానీ జగన్ బచావత్ ట్రైబ్యునల్ అంశాలపై ఒక్కసారి కూడా చర్చించలేదని ఆరోపించారు.