Kerala: కేరళ రాజధానిలో 'అక్షరశ్రీ' పరీక్షలు రాసిన బామ్మలు!
- 'అక్షర శ్రీ' ప్రాజెక్టుకి మంచి స్పందన
- 2,050 మందికి పరీక్షలు
- 80 ఏళ్లు దాటిన వారు ఐదుగురు హాజరు
కేరళ సర్కారు చేపట్టిన సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 'అక్షర శ్రీ' ప్రాజెక్టుకి మంచి స్పందన వస్తోంది. అక్షరాస్యత కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా విజయవంతం అవుతోంది. నిన్న కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన 'అక్షర శ్రీ' అక్షరాస్యత పరీక్షలకు 80 ఏళ్లు దాటిన వారు ఐదుగురు హాజరవడమే ఇందుకు నిదర్శనం. ఈ పరీక్షలకు నగరం నుంచి మొత్తం 2050 మంది హాజరయ్యారు. 85 ఏళ్లు పై బడినప్పటికీ సుమతి అమ్మల్, ధరణి అనే ఇద్దరు బామ్మలు ఈ పరీక్షలు రాయడానికి వచ్చారు. ఈ పరీక్షలు రాస్తున్న వారిలో అందరికంటే అత్యధిక వయసు ఉన్న వారు వీరే.
80 ఏళ్లు దాటిన వారిలో వీరితో పాటు కమలమ్మ (83), సుభద్రమ్మ (83), శారద (82) ఉన్నారు. ఈ పరీక్షలకు హాజరైన వారిలో తస్లీమా (21) అనే అమ్మాయి అందరికన్నా వయసులో చిన్నది. కేరళ అక్షరాస్యత మిషన్ నిర్వహిస్తున్న 'మికవుత్సవం' పథకంలో చేరిన 74 కార్పొరేషన్ వార్డుల వారు ఈ పరీక్షలు రాశారు. మరో 26 వార్డులకు చెందిన 697 మందికి త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. అభ్యర్థుల రాత, మౌఖిక, గణిత నైపుణ్యాలను ఇందులో పరీక్షించారు.