Virat Kohli: మేం ఎన్ని సవాళ్లు విసిరామో కోహ్లీ అన్నింటికి సమాధానం ఇచ్చాడు: డుప్లెసిస్
- పుణే టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ
- ప్రశంసల వర్షం కురిపించిన సఫారీ కెప్టెన్
- స్వభావానికి భిన్నంగా ఆడాడంటూ వ్యాఖ్యలు
పుణే టెస్టులో అజేయ డబుల్ సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సాగించిన విధ్వంసకాండ గురించి ఎంత చెప్పినా తక్కువే. చక్కని టైమింగ్ కు నైపుణ్యం జోడించిన కోహ్లీ అందమైన బ్యాటింగ్ కావ్యాన్ని లిఖించాడు. 254 పరుగులు తానొక్కడే చేసి మ్యాచ్ లో హైలైట్ అయ్యాడు. ఈ టెస్టులో సఫారీల ఓటమి తొలి రెండ్రోజుల్లోనే ఖరారైందంటే అందుకు కారణం కోహ్లీ ఆడిన ఇన్నింగ్సే. ఆ ఇన్నింగ్స్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను కూడా అబ్బురపరిచింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో డుప్లెసిస్ మాట్లాడుతూ, కోహ్లీ తరహాలో ఆడాలంటే ఎంతో మానసిక దృఢత్వం ఉండాలని అన్నాడు.
సాధారణంగా కోహ్లీ రాగానే పరుగుల మీద పడిపోతాడని, ఈసారి అందుకు భిన్నంగా నిదానంగా ఆరంభించి, ఆ తర్వాత ఎదురుదాడికి పాల్పడతాడని తాము ఊహించలేకపోయామని అన్నాడు. తాము ఎన్ని సవాళ్లు విసిరామో కోహ్లీ వాటన్నింటికి సమాధానం ఇచ్చాడని డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుణేలో కోహ్లీని చూస్తే 100, 150తో సంతృప్తి పడేట్టు కనిపించలేదని తెలిపాడు.