Jammu And Kashmir: మొబైల్ సేవల పునరుద్ధరణ ప్రజల కంటే ఉగ్రవాదులకే అనుకూలం: జమ్మూకశ్మీర్ గవర్నర్

  • టెలిఫోన్లు ప్రధానం కాదు.. కశ్మీర్ ప్రజల జీవితాలే ముఖ్యం
  • మొబైల్స్ ఉగ్రవాదులకే ఎక్కువ ఉపయోగపడతాయి
  • ఫోన్ల ద్వారా ఉగ్రవాదులు కార్యకలాపాలను పెంచుకుంటున్నారు

కశ్మీర్ లో మొబైల్ సేవల పునరుద్ధరణపై రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలను ఈరోజు ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ సందర్భంగా గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. 'ఫోన్లు కశ్మీరీలకు అంత ముఖ్యం కాదు. అవి ఉగ్రవాదులకే ఉపయోగపడతాయి. కశ్మీర్ ప్రజల జీవితాలే మాకు ప్రధానం. ఇక్కడి ప్రజలు గతంలో ఫోన్లు లేకుండా ఉన్నారు. ఫోన్ల ద్వారా కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ వారి సంఖ్యను పెంచుతున్నారు' అని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఈ మొబైల్ సేవల పునరుద్ధరణతో సుమారు 40 లక్షల పోస్ట్ పెయిడ్ ఫోన్లు వాడకంలోకి వచ్చాయి. ఆగస్టు 5న కేంద్రం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ను రద్దు చేసిన అనంతరం కశ్మీర్లో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, ఆగస్టు 17 నుంచి ల్యాండ్ లైన్ సేవలను తిరిగి పునరుద్ధరించారు. త్వరలో ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరిస్తామని గవర్నర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News