Narendra Modi: ప్రధాని ఎప్పుడూ ట్రంప్, అంబానీలతోనే కనిపిస్తారు, పేదరైతులతో ఎప్పుడైనా కనిపించారా?: రాహుల్ విమర్శలు
- హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సమరం
- ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- ప్రధాని మోదీపై ధ్వజం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేశారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మన ప్రధాని ఎక్కువగా ట్రంప్, అంబానీ వంటి వ్యాపారులతోనే కనిపిస్తారని, ఏనాడైనా ఓ పేదరైతుతో కనిపించారా? అని ప్రశ్నించారు.
వ్యాపారవేత్తల ప్రయోజనాలే ప్రధానికి ముఖ్యమని, రైతుల పక్షాన ఎప్పుడూ నిలవలేదని అన్నారు. పేదల సొమ్మును వ్యాపారవేత్తలకు పంచిపెడుతున్నారని రాహుల్ మండిపడ్డారు. బీజేపీకి తోడు ఆరెస్సెస్ కూడా విజృంభిస్తోందని, ఈ రెండూ కలిసి దేశాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి విభేదాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.