Telugudesam: ప్రాంతీయ పార్టీలతో నష్టం జరుగుతుందని తెలుసుకున్నా: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి
- అందుకే, జాతీయ వాదాన్ని ఎంచుకున్నా
- నాడు ఎన్టీఆర్ జాతీయ భావాలతో ఉండేవారు
- పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి
గాంధీ సంకల్ప యాత్ర పేరిట ఏపీ వ్యాప్తంగా బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్రలు చేస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఈరోజు నిర్వహించిన పాదయాత్రలో ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియపర్చాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సంకల్ప యాత్ర చేపట్టామని చెప్పారు.
‘ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్న మీరు ఇప్పుడు అలాంటి పార్టీలను విమర్శిస్తున్నారు?’ అన్న ప్రశ్నకు సుజనా స్పందిస్తూ, తప్పు తెలుసుకోవడానికి సమయం కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు సంవత్సరాలలో చూసుకుంటే.. కొంతమంది ఒక పార్టీతో, మరికొంత మంది మరో పార్టీతో వెళ్లారని అన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల నష్టం జరుగుతుందని తెలుసుకున్నాను కనుక జాతీయవాదాన్ని ఎంచుకున్నానని స్పష్టం చేశారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ నాడు ఎన్టీఆర్ జాతీయ భావాలతో ఉండేవారని గుర్తుచేశారు. ఆ తర్వాత కుటుంబపాలన వచ్చిందని విమర్శించారు.
బీజేపీతో అనవసరంగా గొడవలు పెట్టుకుని నష్టపోయామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైజాగ్ లో ఇటీవల వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు సుజానా బదులిస్తూ, టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు తాను ఏం చెప్పానో ఆయనకు తెలుసు అని అన్నారు. ‘ఇప్పుడు, సమయం దాటిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది. ఇప్పుడు రాష్ట్రం భ్రష్టుపట్టిపోతోంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, దీన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నాడు చంద్రబాబుకు బీజేపీ అదే చెప్పిందని, కేంద్రం అన్ని విధాలా సపోర్టు చేసినా ఆయన విఫలం చెందారని విమర్శించారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వెళ్తోందని మండిపడ్డారు.