Chidambaram: చిదంబరంను విచారించేందుకు ఈడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ
- చిదంబరంను విచారించేందుకు అనుమతించాలన్న ఈడీ
- అవసరమైతే అరెస్ట్ చేయండన్న న్యాయస్థానం
ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇకపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనీలాండరింగ్ కేసులో చిదంబరంను విచారించేందుకు అనుమతించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు తన నిర్ణయం వెలిబుచ్చింది. చిదంబరంను ఈడీ విచారించవచ్చంటూ పచ్చజెండా ఊపింది.
బుధవారం నాడు తీహార్ జైల్లో చిదంబరంను ప్రశ్నించవచ్చని, అవసరం అనుకుంటే ఆయనను అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, చిదంబరం రిమాండ్ కోరుతూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై స్పందిస్తూ, చిదంబరంను రిమాండ్ లోకి తీసుకోవడం అనేది ఈ దశలో తొందరపాటు చర్య అవుతుందని, చిదంబరం స్థాయిని దృష్టిలో పెట్టుకుని చూస్తే అది సహేతుకం కాదని పేర్కొంది.