BJP: ఆర్బీఐను లూటీ చేసి డెకాయిట్లకు పెడుతున్నారు: బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ ఫైర్
- దేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
- ఇలా చేస్తే రైతులకు ఆ ఆరువేల రూపాయలు ఎందుకు?
- పేదలకు అన్యాయం చేస్తున్నారు
దేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న గ్యారంటీ బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలిగితే కనుక వారికి పనికిమాలిన ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ‘టీవీ9’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోతోందని, సీజన్ లో రైతాంగం ప్రొటెక్షన్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయలేకపోయారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆర్బీఐను లూటీ చేయించి కార్పొరేట్ కంపెనీలకు, డెకాయిట్లకు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్వెస్ట్ మెంట్లు మొత్తం బకాసురులకు పెట్టి పేదలకు అన్యాయం చేస్తున్నారని, ఈ విషయమై ప్రశ్నిస్తే మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు ప్రతిసారి ఒక సెంటిమెంట్ సృష్టించి పబ్బం గడుపుకుంటారా? ఓట్లు సంపాదించుకుంటారా? చివరకు మూడు నామాలు పెడతారా? అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.