DMK: తమిళనాడులో ఉప ఎన్నికలు.. జయలలిత మరణ ఉదంతాన్ని మరోమారు తెరపైకి తెచ్చిన స్టాలిన్
- ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ వ్యాఖ్యలు
- అధికారంలోకి వస్తే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్
- పళనిస్వామి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు
తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీఎంకే చీఫ్ స్టాలిన్.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చారు. దక్షిణ తిరునెల్వేలి జిల్లాలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ.. జయలలిత మరణ రహస్యాన్ని తమ పార్టీ బయటపెడుతుందని అన్నారు. అపోలో ఆసుపత్రిలో జయలలితను రహస్యంగా ఉంచి చికిత్స అందించారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ వంటి వారు ఆసుపత్రిలో చేరితే అప్పట్లో మంత్రులు ఆ విషయాన్ని మీడియాకు తెలిపేవారని, కానీ జయలలిత విషయంలో అలా జరగలేదని అన్నారు.
కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా ఆసుపత్రి నిత్యం బులిటెన్ జారీ చేసిందని గుర్తు చేశారు. తాము అధికారంలో వస్తే జయలలిత మరణంపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపైనా స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిందని అన్నారు.