Arvind Kejriwal: కారు పార్కింగ్ ఫీజులపై కేజ్రీవాల్ సర్కారు సంచలన నిర్ణయం!
- కన్నాట్‌ప్లేస్, కరోల్‌బాగ్, లజ్‌పత్‌నగర్‌లలో అమలు
- కాలుష్యాన్ని నివారించేందుకేనన్న ప్రభుత్వం
- ప్రతి రోజూ రోడ్లపైకి వస్తున్న 500 కొత్త కార్లు
దేశ రాజధానిలో కాలుష్య భూతాన్ని నివారించేందుకు రకరకాల చర్యలు చేపడుతున్న కేజ్రీవాల్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కారు పార్కింగ్ ఫీజును ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచి కార్ల యజమానులకు షాకిచ్చింది. వాహనాలతో నిత్యం కిటకిటలాడే కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో తొలుత దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు వాహనాలు రోడ్లపైకి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
పార్కింగ్ స్థలం, పార్కింగ్ చేసిన సమయం, వేళలను బట్టి రుసుమును వసూలు చేయనున్నట్టు ఢిల్లీ రవాణా కమిషనర్ తెలిపారు. లజ్‌పత్‌నగర్, కరోల్‌బాగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండడంతో దానిని నివారించేందుకు ఫీజులు పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో ప్రస్తుతం 3.3 మిలియన్ల కార్లు, 7.3 మిలియన్ల ద్విచక్ర వాహనాలున్నాయి. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు.