Jagan: కోర్టుకు రాలేనన్న వైఎస్ జగన్... కౌంటర్ లో కీలక వ్యాఖ్యలు చేసిన సీబీఐ!
- వారానికోసారి కోర్టుకు రావాల్సిన జగన్
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్
- నేటి నుంచి ప్రత్యేక కోర్టులో వాదనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ, గతంలోనే జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక తాజాగా, కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని, ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది. వారానికోసారి కోర్టుకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏముంటాయని ప్రశ్నించింది.
కాగా, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగన్ వ్యక్తిగత హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, గతంలో ముఖ్యమంత్రులపై కోర్టు కేసుల తీరును పరిశీలిస్తే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.