nirmala sitharaman: అమెరికాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం: నిర్మలా సీతారామన్ ఆశాభావం
- ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీతారామన్
- కొన్ని అంశాల్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి
- అమెరికాతో వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోంది
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధ విభేదాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాషింగ్టన్ లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. త్వరలోనే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు. 'ఈ విషయంపై జరుగుతున్న చర్చలకు ఎంత ప్రాముఖ్యం ఉందో నాకు తెలుసు. కొన్ని అంశాల్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. స్వల్ప విభేదాలు మాత్రమే వస్తున్నాయి' అని వ్యాఖ్యానించారు. వీటిపైనే వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోందని వివరించారు.
కాగా, బాదం, యాపిల్స్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై కొన్ని నెలల క్రితం భారత్ సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో భారత్ కు వాణిజ్య రంగంలో ఇస్తున్న ప్రత్యేక పన్ను రాయితీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జూన్ లో రద్దు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్వల్ప విభేదాలు నెలకొన్నాయి. అమెరికా 'సాధారణీకరించిన ప్రాధాన్యతల విధానం' ద్వారా అభివృద్ధి చెందుతోన్న దేశాలకు ప్రత్యేక పన్ను రాయితీ ఇస్తోంది. ఈ జాబితాలో భారత్ ఉండేది.