Mahbubnagar District: ఖైదీల నిర్వహణలో హోటల్.. ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు
- మహబూబ్నగర్ జిల్లా జైలు వద్ద హడావుడి
- ఆఫర్ బాగుందంటున్న ఆహార ప్రియులు
- మూడు రోజుల్లో వేయి దాటిన కస్టమర్ల సంఖ్య
ప్లేట్ ఇడ్లీ రూ.30 నుంచి రూ.40 ఉన్న ఈ రోజుల్లో ఐదు రూపాయలకు నాలుగు ఇడ్లీలు దొరుకుతున్నాయంటే ఎవరైనా ఉత్సాహం చూపించకుండా ఉంటారా? ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జైలు వద్ద ఇటువంటి హడావుడే నెలకొంది. ఇక్కడ ఖైదీల ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాంటీన్లో ఇడ్లీలు చౌకగా లభిస్తుండడంతో ‘ఆహా...ఏమి రుచి’ అంటూ ఆహార ప్రియులు ఎగబడుతున్నారు.
వివరాల్లోకి వెళితే... క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్దుకుని జైలు జీవితం పూర్తయ్యేసరికి పరివర్తనతో బయటకు రావాలన్న ఉద్దేశంతో జైలు అధికారులు ఖైదీల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. వృత్తి పనులు, కూరగాయలు పండించడం, డెయిరీ ఫాం... ఇలా పలు వ్యాపకాలు నిర్దేశిస్తారు. మహబూబ్నగర్ జైలు అధికారులు అక్కడి ఖైదీలతో హోటల్ పెట్టించారు.
మూడు రోజుల క్రితం ప్రారంభమైన ఈ హోటల్లో ఐదు రూపాయలకు నాలుగు ఇడ్లీలు అందిస్తున్నారు. తొలిరోజు 400 మంది టిఫిన్ తినగా, మూడో రోజు నాటికి వీరి సంఖ్య 1100కు చేరింది. గిరాకీ పెరగడంతో రోజుకు రూ. 7 నుంచి రూ. 9 వేల వరకు ఆదాయం లభిస్తోందని, కనీసం రూ3. వేల రూపాయల వరకు మిగులుతోందని అధికారులు చెపుతున్నారు.